అయోధ్యలో రామాలయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి ఆయోధ్యపై ఉంది. ఇప్పటికే అయోధ్యలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నో సంస్థలు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కూడా ఇక్కడ ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఇక ఓ హెడ్ క్వార్టర్ ను ఏర్పాటు చేసేందుకు ఆర్ఎస్ఎస్ రెడీ అవుతోంది. విశాలమైన స్థలంలో హెడ్ క్వార్టర్ ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. దీని కోసం నవ్య అయోధ్య నగరంలో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించాలంటూ యోగీ సర్కార్‌కు ఆర్ఎస్ఎస్ దరాఖాస్తు పెట్టుకుంంది.
1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకోనుంది. అంతకన్నా ముందే అయోధ్యలో నూతన హెడ్ క్వార్టర్ నిర్మించాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు చేస్తోంది. దీనికోసం 100 ఎకరాల భూమి కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ కోరింది.
నవ్య అయోధ్యలో గ్రీన్ ఫీల్డ్‌షిప్ పథకంలో భాగంగా హౌసింగ్ డెవలప్ మెంట్ బోర్డు నుంచి ఈ భూమిని ఇప్పించాలంటూ సర్కార్ ను ఇప్పటికే సంఘ్ పరివార్ కోరినట్టు తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అయోధ్యాపురిలో ఆర్ఎస్ఎస్ నగరం రూపుదిద్దుకోవడం ఖాయమని తెలుస్తోంది. అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ తమ కార్యకలాపాల నిమిత్తం కరసేవక్‌పురం, రామసేవక్‌పురంలను ఏర్పాటుచేసింది.