భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే. ఇటీవల దుబాయ్ లో జరిగిన ఓపెన్ మహిళల డబుల్స్ లో చివరి మ్యాచ్ ఆడిన సానియా, తన ప్రొఫెషనల్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ మ్యాచ్ తొలి రౌండ్ లోనే సానియా – మాడిసన్ కీస్ జోడి ఓటమి పాలైంది.
తన చివరి టోర్నీని విజయంతో ముగిస్తుందని ఆమె అభిమానులు ఆశించినప్పటికీ ఓటమితో సానియా వెనుదిరాగాల్సి వచ్చింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే మరోసారి సానియా టెన్నిస్ బ్యాట్ పట్టనుంది.
హైదరాబాద్ లో ఆదివారం మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ జరగనుంది. ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. తన కెరీర్ లో చివరి మ్యాచ్ హైదరాబాద్ లో ఆడాలని భావించింది.
సొంత గడ్డపై ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుండటం సంతోషంగా ఉందని సానియా మీర్జా తెలిపింది. హైదరాబాద్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పింది. రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీకి అధిక సమయం కేటాయిస్తానని చెప్పుకొచ్చింది సానియా మీర్జా.
కాగా ఆరేళ్లకు టెన్నిస్ పై ఆసక్తి పెంచుకున్న సానియా 2003లో టెన్నిస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించింది. తన 20 ఏళ్ల కెరీర్ లో ఆటతో పాటు సానియాను ఎన్నో వివాదాలు కూడా వెంటాడాయి. వాటంన్నింటినీ అధిగమించి తన కెరీర్ లో ముందుకు సాగుతూ ఎందరో యంగ్ స్పోర్ట్స్ ఉమెన్స్ కు రోల్ మోడల్ గా నిలిచింది సానియా.