నిండు జీవితానికి రెండు చుక్కలంటూ… చిన్నారులు పోలియో బారిన పడకుండా పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతుంటారు. అందరికీ పోలియో చుక్కలు అందాలన్న ఉద్దేశంతో ఆదివారం ప్రారంభించి, ఆ మరుసటి రోజు హెల్త్ వర్కర్లు ఇంటింటికి తిరుగుతూ 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేస్తారు.
కానీ ఓ చిన్న నిర్లక్ష్యం ఇప్పుడు 12మంది చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. పోలియో చుక్కలకు బదులుగా కరోనా వైరస్ సోకకుండా వాడుతున్న శానిటైజర్ ను వ్యాక్సిన్ గా వేసేశారు. దీంతో ఆ చిన్నారులంతా అనారోగ్యం బారిన పడటంతో వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని యావట్మాల్ జిల్లాలో చోటు చేసుకుంది.
గ్రామ పంచాయితీ ఆవరణలో పోలియో చుక్కలు వేయించేందుకు వారి తల్లితండ్రులు రాగా… అందులో 12మందికి పొరపాటున శానిటైజర్ వేశారు. దీంతో ఆ చిన్నారులకు వాంతులయ్యాయి. రాత్రి వరకు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. దీంతో వారందరినీ ఆసుపత్రికి తరలించగా… విషయం భయటపడింది. అయితే, ఆ చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
ఈ మొత్తం ఘటనకు కారణమైన స్థానిక అంగన్ వాడీ టీచర్ తో పాటు ఆశా వర్కర్ ను జిల్లా యంత్రాంగం సస్పెండ్ చేసి, దర్యాప్తుకు ఆదేశించింది.