– రఘునందన్ రావుపై కేసు
– ప్రభుత్వం, పోలీసులపై బండి సీరియస్
– ముందు దోషులపై శ్రద్ధ పెట్టమని సెటైర్లు
– రోజుకో ఘోరం వెలుగుచూడడం..
– ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక ఘటనను సీబీఐకి అప్పగించాలని బీజేపీ పట్టుబడుతోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు.. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. ఈ అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న శ్రద్ధ.. దోషులను అరెస్ట్ చేయడం పట్ల చూపితే న్యాయం జరిగేదని అన్నారు.
టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు సంజయ్. ఈ తరహా ఘటనలు రోజుకొకటి వెలుగు చూడడం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమన్నారు. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనమేని విమర్శించారు.
నేరాలను అరికట్టడంలో తామే నెంబర్ వన్ అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఈ ఘటనపై స్పందించరా అని నిలదీశారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని.. దోషులను శిక్షించే వరకు బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు బండి సంజయ్.