మహారాష్ట్రలో ఊహించని పరిణామాలు శివసేనకు మింగుడు పడడం లేదు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెన్ను పొడిచారని శివసేన నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ నేత శరద్ పవార్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల వరకు తమతోనే ఉన్న ఆ మహాశయుడు( అజిత్ పవార్) ఆ తర్వాత అదృశ్యమయ్యాడన్నారు. కొద్ది సేపటి తర్వాత వచ్చిన అతను తమ కళ్లలోకి కళ్లు పెట్టి కూడా చూడలేకపోయారని…తప్పు చేసిన వాళ్లు ఎలా కిందికి తలదించుకొని మాట్లాడతారో అలాగే మాట్లాడారని…అప్పుడే తమకు అనుమానం వచ్చిందని సంజయ్ రౌత్ చెప్పారు.శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే టచ్ లోనే ఉన్నారని చెప్పారు. శనివారం కూడా వాళ్లిద్దరు కలిసే మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.