రాజ్యసభ ఎంపీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను కష్టాలు వదలడం లేదు. తాజాగా పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో ఆయనకు జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఈ నెల 10వరకు కస్టడీని పొడిగిస్తున్నట్టు ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించింది.
మరోవైపు అదే రోజు ఆయన బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరపనున్నది. అంతకు ముందు సెప్టెంబర్ 10న ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్రాచాల్ భూ కుంభకోణంలో శివసేన నేత రౌత్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.
ఈ క్రమంలో జూలైలో ఆయన్ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఆయన్ని సుమారు ఆరు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఆ తర్వాత జూలై 31న అర్ధరాత్రి తర్వాత రౌత్ ను అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
ఆ తర్వాత న్యాయస్థానం ఎదుట ఆయన్ని ఈడీ అధికారులు హాజరు పరిచారు. విచారణ అనంతరం ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత పలుమార్లు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.