తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలకు శివసేన 24 గంటల టైమిచ్చింది. ఆలోపు అందరూ తిరిగి రావాలని కోరింది. పాలక కూటమి నుండి వైదొలగాలనే వారి డిమాండ్ ను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.
రెబల్ ఎమ్మెల్యేల డిమాండ్ పై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడారు. “మేము మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుండి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు 24 గంటల్లో గౌహతి నుండి ముంబైకి తిరిగి రావాలి” అని అన్నారు.
గత రెండున్నరేళ్ల సంకీర్ణ పాలనలో శివసైనికులు ఎక్కువగా నష్టపోయారని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వీరికి నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే.. కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తును విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మెత్తబడిని పార్టీ అధిష్టానం అందుకు ఓకే చెప్పింది.
ఇక రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన దీపక్.. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్ధవ్ రాజీనామా చేయడం తమకు ఎవరికీ ఇష్టం లేదని అన్నారు. దానికి బదులుగా పాత మిత్రుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కోరారు.