కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడదని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం భేటీ అయ్యారు.
దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియా సమావేశంలో సోమవారం మాట్లాడారు. ‘ కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేఖ రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేము ఎప్పుడూ చెప్పలేదు.
మొదట్లో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ మాట్లాడారు. అప్పుడు కూడా మేము కాంగ్రెస్ ను ఈ ఫ్రంట్ లోకి తీసుకోవాలని సూచించాము. ఈ ఫ్రంట్ ను నడిపించే సత్తా సీఎం కేసీఆర్ కు ఉంది” అని అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన మిత్రపక్షం కాంగ్రెస్ ను కలుపుకు పోవాలని చూస్తున్నామని శివసేన చెప్పడం గమనార్హం.