ఉపాధి కల్పించడంలో కేసీఆర్ పాలమూరుకు తీరని ద్రోహం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బతుకుదెరువు కోసం ముంబయి వెళ్తున్న నారాయణపేట జిల్లా వాసులను పలకరించారు. వలస కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతారని సంజయ్ విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో వలసలు పెరిగాయని ఆరోపించారు. చంటి పిల్లలను ఎత్తుకుని.. మూట, ముల్లె సర్దుకుని ప్రతి రోజూ వందల మంది ఉపాధి వలసలు పోతున్నారంటే కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని ధ్వజమెత్తారు.
కేసీఆర్ అబద్ధాలతో పుట్టిన వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు సంజయ్. కేసీఆర్ ది నోరు కాదు.. తాటిమట్ట అని అన్నారు. పాలమూరుకు సాగునీరు, తాగునీరు రావాలన్నా.. వలసలు ఆపాలన్నా.. రాష్ట్ర ప్రజలు దృఢ సంకల్పం ముందడుగు వేయాలని సూచించారు. 68 జీవో ద్వారా ప్రాజెక్టులు రావాలని అన్నారు.
Advertisements
ఆగమంటే వలసలు ఆగవని.. అవసరమైన సాగు, తాగునీరు వసతులు కల్పించడంతో పాటు.. ఉపాధి కల్పిస్తే పాలమూరులో వలసలు ఆగుతాయని పేర్కొన్నారు బండి. పాలమూరు పచ్చబడాలన్నా.. వలసలు ఆగాలన్నా.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. మానవత్వం లేని కేసీఆర్ మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు సంజయ్.