– కేసీఆర్ కుర్చీ వేసుకుని కుర్చునేది ఎప్పుడు?
– పోడు రైతులకు పట్టాలు పంచేదెప్పుడు?
– పోడు భూముల్లో హారితహారం ఏంటి?
– ఆదివాసీల సమస్యలపై నిలదీస్తూ..
– కేసీఆర్ కు బండి లేఖ
పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని, హరితహారం కార్యక్రమం నిలిపివేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న పోడుభూముల సమస్యలు పరిష్కరించకుండానే ఆ భూముల్లో హరితహారం చేపట్టేందుకు ఉపక్రమించడం గిరిజనులను నయవంచనకు గురిచేయడమేనన్నారు. బీజేపీ తెలంగాణ శాఖ హరితహారం కార్యక్రమానికి వ్యతిరేకం కాదని… కేవలం పోడు భూముల్లో ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమం చేపడితే బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని దాదాపు మూడున్నర లక్షల మంది ఇప్పటికే ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు బండి. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర యంత్రాగాన్ని అంతా తీసుకుని పోయి గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని 2019 జులైలో కేసీఆర్ ప్రకటించారన్నారు. అలాగే నవంబర్ 23, 2018న మహబూబాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అవసరమైతే కుర్చీవేసుకుని మరీ పట్టాలు అందజేస్తామని చెప్పారని వివరించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారినుంచి అక్టోబర్ నుండి ధరఖాస్తులు తీసుకోవాలని, వాటి పరిశీలనకు నవంబర్ లో సర్వే ప్రారంభించాలని, క్షేత్రస్థాయి పరిశీలన తరువాత పట్టాలు ఇవ్వాలని 2021 అక్టోబర్ లో నిర్వహించిన హైలెవల్ మీటింగ్ లో నిర్ణయించారని గుర్తు చేశారు. 2019 అసెంబ్లీలో సీఎం ప్రకటన నుండి ఇప్పటివరకు పోడు భూముల సమస్య అలాగే ఉందన్నారు.
‘‘తెలంగాణలో 24 జిల్లాల్లో 10 లక్షలకు పైగా పోడుభూముల పట్టాల సమస్య ఉంది. 2450 ఆదీవాసీ గ్రామాల్లో గిరిజనులు వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006 సంవత్సరంలో పోడు భూములకు పట్టాలకోసం 1,83,252 ధరఖాస్తులు రాగా 1,01,177 మందికి హక్కు పత్రాలు అందాయి. అప్పటినుండి కొనసాగుతున్న సమస్యపై ప్రభుత్వం తాత్సారం చేయడం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అక్కడి ఫలాలపై, పోడు భూములపై గిరిజనులకు పూర్తి హక్కులున్నాయి. చట్టపరంగానే గిరిజనులకు ఉన్న హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరం. పోడుభూములకు పట్టాలకోసం ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగా మరోవైపు హరితహారానికి ఫారెస్ట్ అధికారులు సన్నాహం చేయడం గర్హనీయం. ప్రభుత్వ చర్యల వలన గిరిజన ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. గతంలో ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి చర్యలవల్ల గిరిజనులకు, ఫారెస్టు అధికారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అనేక జిల్లాల్లో గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం జైలుకు పంపింది’’ అని వివరించారు బండి సంజయ్.
ఆదివాసీలు, గిరిజనులు అడవికి హక్కుదారులని.. పోడు భూముల జోలికి ప్రభుత్వం వెళ్తే వారు సహించరని హెచ్చరించారు. ఈ విషయాన్ని గ్రహించి హామీ ఇచ్చిన ప్రకారం పోడు భూమి పట్టాకోసం ధరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్క గిరిజనుడు, ఆదివాసీకి మంజూరు చేయాలన్నారు. అలాగే పోడు భూముల్లో హరితహారం కార్యక్రమం చేపట్టడాన్ని విరమించుకోవాలని, ఆదివాసీలపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పోడుదారులకు పట్టాలిచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమస్య పరిష్కరించకుండా ముందుకు వెళ్తే.. ఎదురయ్యే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. పోడు భూముల సమస్యలపై పోరాడుతున్న గిరిజనులకు, ఆదివాసీలకు బీజేపీ అండగా ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు బండి సంజయ్.