యాసంగి వడ్ల కొనుగోలు డబ్బు రైతులకు వెంటనే చెల్లించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీంఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు.
యాసంగిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనే రైతుల నుంచి కొన్న వడ్లకు రూ.517.16 కోట్లను ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్షించి పరష్కరించాలని, ఖరీఫ్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సకాలంలో అందజేయాలని డిమాండ్ చేశారు.
ఖరీఫ్ సీజను ప్రారంభం అవుతున్నా యాసంగి పంట డబ్బు చేతికి రాకపోవడంతో డబ్బుకోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థులు రైతులకు అప్పుల ఆశచూపి అధిక వడ్డీలు వసూళ్ళు చేస్తున్నారని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,91,852 మంది రైతుల నుండి 11.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారని,.. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.2197.16 కోట్లు కాగా వీటిలో ఇంకా రూ.517.16 కోట్లు ప్రభుత్వం రైతులకు బకాయిపడిందని బండి తెలిపారు.
రాష్ట్రప్రభుత్వ అహంకార పూరిత ప్రకటనలతో దాదాపు 14 లక్షల ఎకరాలలో యాసంగిలో రైతులు వరిపంట వేయలేదని సంజయ్ ఆరోపించారు. దీంతో వరివేయని రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని,.. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉన్నా మీ ప్రభుత్వ రాజకీయ అవసరాల కోసం సాధారణ రైతులను బలిపశువులను చేస్తోందని విమర్శించారు.