ఐపీఎల్ లో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. ఎప్పుడు ఎవరు క్లిక్ అవుతారో అంచనా వేయడం కష్టం. అలాగే కెప్టెన్సీ విషయంలోనూ అంతే. ఈసారి సీజన్ లో చూడండి.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ సారథ్యంలోని ముంబై జట్టు ఎంత పేలవ ప్రదర్శన ఇచ్చిందో చూశాం. అలాగే.. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ను ముందుగా అందరూ తక్కువ అంచనానే వేశారు. కానీ.. తన జట్టును అతడు ఫైనల్ కు చేర్చి అందరికీ షాకిచ్చాడు.
సీజన్ ప్రారంభంలో శాంసన్ కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ.. అతని నాయకత్వంపై మాత్రం రాజస్థాన్ ఫ్రాంఛైజీ పూర్తి భరోసా ఉంచింది. సంజూ కూడా దాన్ని నిలబెట్టుకున్నాడు. కెప్టెన్సీపై నెలకొన్న చాలా సందేహాలను పటాపంచలు చేశాడు. తనపై వచ్చిన విమర్శలను గట్టి జవాబిచ్చాడు. అయితే.. సీజన్ ప్రారంభంలో ఐపీఎల్ ప్రసారకర్తలు ఓ యానిమేటెడ్ వీడియో చేయగా.. అందరూ కెప్టెన్లు అందులో కన్పించారు కానీ.. సంజూ శాంసన్ మాత్రం కన్పించలేదు. దీంతో అతడి భార్య చారులత తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
రాజస్థాన్ ఫైనల్ కు దూసుకెళ్తున్న సమయంలో ఇన్ స్టాగ్రామ్ లో యానిమేటెడ్ వీడియో స్టోరీ పోస్ట్ చేసింది సంజూ భార్య. అన్ని జట్ల కెప్టెన్లు ఉన్నప్పుడు తన భర్తను ఎందుకు అందులో చూపించలేదంటూ మండిపడింది. ఐపీఎల్ ప్రకటనకర్తలకు అంతగా లోకువయ్యాడా అనేలా గట్టిగానే ప్రశ్నించింది. అప్పుడు ఆర్ఆర్ ను నిర్లక్ష్యం చేశారు.. ఇప్పుడు చూడండి ఫైనల్ చేరుకుంది అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక తన స్టోరీలో తర్వాతి పోస్టుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ కు చేరుకున్న చిత్రాన్ని కూడా ఆమె షేర్ చేసింది.
ప్రస్తుతం చారులత పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. సంజూ ఫ్యాన్స్ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇవ్వాల్సిన టైమ్ లో గట్టిగా ఇచ్చారని కామెంట్స్ పెడుతున్నారు.