రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సొంతూళ్లకు పయనమయ్యేవారు చాలా మందినే ఉంటారు. దీంతో ట్రావెల్స్ వారు దొరికిందే అవకాశం అన్నట్లు దండుకుంటున్నారు. సాధారణ ధర కంటే మూడు, నాలుగు రెట్లు ధరలు పెంచేసి ప్రయాణికుల వద్ద నుంచి వసూళ్లు చేస్తున్నారు.
దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వారు, కర్నాటక వారు వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు సరిపోక ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్…ఛార్జీల రేట్లను నాలుగు రేట్లు చేశారు.
సాధారణ ఛార్జీల కంటే ఏసీ స్లీపర్‌లో ఒక్కో బెర్తుకీ 800 నుంచి 1000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయి. అలాగే ఏసీ సీటర్ లో 700 నుంచి 800 రూపాయలు ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తున్నాయి. పండుగల సమయంలో కంటే.. మామూలు రోజుల్లో ఇళ్లకు వెళ్లడం బెటరేమో అని అనుకునేలా ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తున్నాయి.
ఈ క్రమంలో సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో అధిక ఛార్జీలు, ఫిట్ నెస్ లేని బస్సులను రోడ్డు మీదకు తీసుకుని వస్తుండటంతో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం నాడు హయత్‌నగర్-విజయవాడ హైవేపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. అటు విశాఖపట్నంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.