సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలేంటి.. వాటి రిలీజ్ డేట్ ఏంటనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. మొన్నటివరకు రిలీజ్ డేట్స్ పై చాలా గందరగోళం నడిచింది. చివరికి విజయ్ నటించిన వారసుడు సినిమాను 11 నుంచి 14కు వాయిదా వేశారు. అదే టైమ్ లో 14కు రావాల్సిన కల్యాణం కమనీయం సినిమాను 15కు వాయిదా వేశారనే పుకార్లు వచ్చాయి. అయితే కల్యాణం కమనీయం సినిమా కూడా 14కే వస్తోంది.
ఈ క్రమంలో సంక్రాంతి సినిమాల రన్ టైమ్స్ కూడా లాక్ అయ్యాయి. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో, ఏ సినిమా ఎంత నిడివి ఉందనే విషయం బయటకొచ్చింది. అవేంటో చూద్దాం..
సంక్రాంతి బరిలో ముందుగా థియేటర్లలోకి వస్తున్న సినిమా తెగింపు. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా 2 గంటల 25 నిమిషాలుంది. ఇది పెర్ ఫెక్ట్ రన్ టైమ్.
ఇక సంక్రాంతి బరిలో రెండో సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా 2 గంటల 49 నిమిషాలుంది. సినిమా సెకెండాఫ్ లో అద్భుతమైన ఎమోషన్ ఉందని, కాబట్టి రన్ టైమ్ ఎక్కువైనా ఎలాంటి ఇబ్బంది ఉండదని యూనిట్ భావిస్తోంది. రన్ టైమ్ పై కాస్త గట్టిగా దృష్టి పెట్టే బాలకృష్ణ కూడా ఈ విషయంలో మెత్తబడ్డారు.
ఇక సంక్రాంతి బరిలో నిలిచిన మూడో సినిమా వాల్తేరు వీరయ్య. చిరంజీవి నటించిన ఈ సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉంది. ఇందులో కూడా సేమ్ లాజిక్ చెబుతున్నారు మేకర్స్. సెకెండాఫ్ లో రవితేజ నటించిన ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయట. అందుకే నిడివి ఎక్కువైనా అలానే ఉంచేశారు.
ఇక సంక్రాంతి బరిలో చివరిగా వస్తున్న సినిమాలు వారసుడు, కల్యాణం కమనీయం. వారసుడు సినిమా అచ్చంగా 2 గంటల 50 నిమిషాలు ఉంది. ఇక కల్యాణం కమనీయం సినిమా అతి తక్కువగా గంట 46 నిమిషాలు మాత్రమే ఉంది.