ప్రతి సంక్రాంతికీ క్రేజీ మూవీస్ వస్తుంటాయి. బడా హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటారు. వసూళ్ల లెక్కలు, సరికొత్త రికార్డులతో రోజుకో పోస్టర్ వస్తుంటుంది. ఆ హంగామానే వేరు. కానీ ఈసారి సంక్రాంతికి సీన్ రివర్స్ అయింది. థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ హంగామా కనిపించింది.
ముందుగా థియేటర్ల విషయానికొద్దాం. ఈసారి సంక్రాంతి బరిలో బంగార్రాజు తప్ప మరో పెద్ద సినిమా లేదు. సూపర్ మచ్చి, రౌడీబాయ్స్, హీరో.. ఇలా అన్నీ చిన్న సినిమాలే. కాబట్టి డిస్కషన్ మొత్తం బంగార్రాజు చుట్టూనే తిరిగింది. అది కూడా ఏబోవ్ యావరేజ్ కంటెంట్ అంటూ రివ్యూస్ రావడంతో చాలామంది వెనక్కి తగ్గుతున్నారు.
ఇదే సమయంలో ఓటీటీలో మాత్రం చాలా హంగామా కనిపిస్తోంది. రీసెంట్ గా థియేటర్లలోకొచ్చిన స్కైలాబ్ సినిమాను ఇవాళ్టి నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు పెట్టారు. ఇక నార్త్ లో సూపర్ హిట్టయిన పుష్ప సినిమా హిందీ వెర్షన్ ను ఇవాళ్టి నుంచే అమెజాన్ ప్రైమ్ లో పెట్టారు. ఈ మూవీకి సంబంధించి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
వీటితో పాటు హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, ఆహాలో పలు వెబ్ సిరీసులు అందుబాటులోకి వచ్చాయి. ఓవరాల్ గా కంపేర్ చేసి చూసుకుంటే.. ఈ సంక్రాంతికి థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ హంగామా కనిపిస్తోంది.