సంక్రాంతి పండుగకు, తెలుగు సినిమాలకు ఎప్పటి నుండో విడదీయలేని అనుబంధం ఉంది. సంక్రాంతికి కనీసం ఇద్దరు లేక ముగ్గురు పెద్ద హీరోలు తమ సినిమాలను పకడ్బందీగా ప్లాన్ చేసుకుని మరీ విడుదల చేయడం ఆనవాయితీ. సంక్రాంతి అనగానే వరుసగా వచ్చే మూడు రోజుల సెలవులు, ఆ మూడు రోజుల కలెక్షన్స్ చాలు ఈ రోజుల్లో ఒక సినిమా గట్టెక్కడానికి. అదే కాకుండా సంవత్సరం మొత్తంలో రిలీజయ్యే సినిమాల కంటే సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలకే ఎందుకనో విజయావకాశాలు ఎక్కువగా వచ్చాయి మన టాలీవుడ్‌లో.
ఇదే సెంటిమెంట్‌తో ఇప్పటికే మరో నాలుగు నెలల తర్వాత వచ్చే సంక్రాంతికి ఇప్పటికే కర్చీఫ్‌లు వేసుకుని, మరీ సిద్ధపడుతున్నారు కొందరు తెలుగు సినిమా హీరోలు. ఈ సంక్రాంతికి ఇప్పటికే ఐదు సినిమాలు రెడీ అయిపోయి అనౌన్స్ చేసెయ్యడం జరిగిపోయింది. ముందుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మొదటిసారిగా ఆర్మీ మేజర్ పాత్రలో కనిపిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” సినిమా ఉంది. సక్సెస్‌తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. మహేశ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అలనాటి హీరోయిన్, లేడీ అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
అలాగే ఈ సంక్రాంతి విడుదల రేసులో ఉన్న మరో పెద్ద సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం హ్యాట్రిక్ కాంబినేషన్‌గా వస్తున్న “అల వైకుంఠపురంలో”. సంక్రాంతి రేసులో ఉన్న మరో పెద్ద సినిమా నందమూరి బాలకృష్ణ, కే.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా. అసలే బాలకృష్ణకు సంక్రాంతి విడుదల ఒక మంచి సెంటిమెంట్ కావడం ఎలాగైనా సరే సినిమాని రెడీ చేసి, విడుదల చెయ్యాలన్న కసి మీదున్నారు. సంక్రాంతి బరిలో ఉన్న మరో పెద్ద సినిమా, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న “దర్బార్”. ఇన్ని పెద్ద సినిమాలతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తను చేస్తున్న “ఎంత మంచివాడవురా” సినిమా కూడా సంక్రాంతికే విడుదలవుతున్నట్టు ప్రకటించేశారు.
యాక్షన్, స్టైల్, మాస్, డబ్బింగ్ అండ్ ఫీల్ గుడ్… ఇలా ఐదు విభిన్నమైన చిత్రాలు రాబోయే 2020 సంక్రాంతికి తెలుగు సినీ ప్రేక్షకుల కనులకు పంచభక్ష్య పరమాన్నాల విందులా ఉండబోతోంది మరి. ఈ రేసులో ఎవరు గెలుస్తారో తెలియడానికి మరో నాలుగు నెలలు ఆగక తప్పదు.