సన్న వడ్లు పండించిన రైతులు సందిగ్దంలో పడ్డారు. కోతలు పూర్తయినా వడ్లను కళ్లాల్లోనే దాచిపెట్టారు. సర్కార్ ప్రకటించే మద్దతు ధర కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జనగామ జిల్లా బహిరంగ సభలో రెండు, మూడు రోజుల్లో మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్..రోజులు గడుస్తున్నా ఏ మాటా చెప్పకపోవడంతో అయోమయంలో పడ్డారు.
రోజులు తరబడి వడ్లు కళ్లాల్లోనే ఉంటే… తేమశాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే బరువు కూడా తగ్గుతుంది. ఫలితంగా మద్దతు ధర కోసం ఎదురుచూస్తూ గడిపేస్తే.. మరో రకమైన నష్టం కూడా తప్పదేమోనని రైతులు భయపడుతున్నారు. కొన్నిచోట్ల రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వారిచ్చిన రేటుకే వడ్లు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు.
సన్న రకాలకు అధిక ధర ఇస్తే.. కేంద్రం ఇక్కడి వడ్లను కొనబోమని చెప్పిందని.. రాష్ట్రమే ముందుకొచ్చి రూ.100 లేదా రూ.150 అధికంగా ఇస్తామని సీఎం చెప్పారు. కనీసం ఆ వంద, నూటాయాభై ఇచ్చేందుకు కూడా ప్రభుత్వానికి ధైర్యం రావడం లేదు. వాస్తవానికి సీఎం చెప్పిన ఆ ధర అసలు గిట్టుబాటు కానే కాదు. ఎందుకంటే దొడ్డు రకానికి కంటే.. సన్న రకానికి అయ్యే వ్యయం ఎక్కువ. దిగుబడి తక్కువ. అలాగే సమయం కూడా ఎక్కువే. ఇచ్చే మద్దతు ధరనే చాలా తక్కువ అంటే అది కూడా ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.