సంతోష్ నగర్ అత్యాచార ఘటన అంతా ఫేక్ అని తేల్చారు పోలీసులు. ప్రేమించినవాడు దక్కలేదన్న కోపంతో అతడ్ని కేసులో ఇరికించేందుకు ప్రయత్నించింది యువతి. బుధవారం రాత్రి తనను కొందరు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. అసలే.. గాంధీ ఆస్పత్రి ఘటన తలనొప్పిగా తయారవ్వడంతో.. పోలీసులు వెంటనే యాక్షన్ చేపట్టారు. ప్రత్యేక టీమ్స్ గా ఏర్పడి యువతి చెప్పిన దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
యాదగిరి థియేటర్ నుంచి పహాడీషరీఫ్ వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాల పుటేజ్ ని పరిశీలించారు. చాలామంది ఆటోడ్రైవర్లను విచారించారు. కానీ.. ఒక్క క్లూ కూడా దొరకలేదు. అయితే యువతి చెప్పిన దానికి సీన్ ఆఫ్ అఫెన్స్ కు ఎక్కడా పొంతన లేదు. పైగా ఆమె పని చేస్తున్న ప్రదేశానికి ఇంటికి రెండు కిలోమీటర్లు కూడా లేదు.. దీనికితోడు ఆమె యాదగిరి థియేటర్ వరకు వచ్చి ఆటో ఎందుకు ఎక్కిందనే అనుమానం పోలీసులకు వచ్చింది.
చివరికి ఆమెను అనేక కోణాల్లో విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. తాను ప్రేమించిన వ్యక్తి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని.. ఆ కక్షతోనే అతడ్ని ఈ కేసులో ఇరికించేందుకు నాటకమాడినట్లు ఒప్పుకుంది.