సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మెస్ చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి గృహాలను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది.
హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సమీక్షించడంతో పాటు సమీపంలో ఉన్న హాస్టళ్లలో సర్దుబాటు చేసే అవకాశాలపై నివేదిక తయారు చేయాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలతో పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో డైట్ చార్జీల పెంపు పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.
ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. మెస్ చార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. అలాగే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేసి మరిన్ని మెరుగైన వసతులు కల్పించే విషయంపైనా చర్చించారు.
జిల్లాల వారీగా నివేదికలు..రెడీ చేస్తున్నారు. అయితే సగటున ఒక సంక్షేమ హాస్టల్ లో కనీసం 50 మంది విద్యార్థలుండాలి. దాదాపు వంద మందికి వసతులు కల్పిస్తూ హాస్టల్ ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. అందులో కనీసం సగం మంది పిల్లలుంటేనే మెరుగైన వసతులు కల్పించవచ్చు.
అలా కాకుండా 15 నుంచి 25 మంది విద్యార్థులుంటే సర్కార్ ఖజానాపై భారం అధికంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,550 సంక్షేమ వసతి గృహాలున్నాయి. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య సంతృప్తికంగా ఉన్నప్పటికీ చాలా చోట్ల ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే వచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.