ఏప్రిల్ 1.. ఈ తేదీని మహేష్ బాబు అభిమానులు ఎప్పుడో లాక్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే, ఆరోజు మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట సినిమా వస్తోంది కాబట్టి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు నుంచి వస్తున్న మూవీ కావడంతో, ఘట్టమనేని అభిమానులు ఏప్రిల్ 1 కోసం ఇప్పట్నుంచే నిరీక్షిస్తున్నారు. అయితే వీళ్ల నిరీక్షణ మరికొన్నాళ్లు సాగేలా ఉంది. అవును.. సర్కారువారి పాట సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ వస్తున్న కారణంగా అందరికంటే ముందు సంక్రాంతి బరి నుంచి తప్పుకొని, ఏప్రిల్ 1 విడుదల అంటూ పోస్టర్ వేశాడు మహేష్. కట్ చేస్తే, ఇప్పుడు ఆ తేదీ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం షూటింగ్ మళ్లీ పెండింగ్ లో పడ్డమే.
అవును.. సర్కారువారి పాట సినిమాకు సంబంధించి ఇంకా నెల రోజుల పాటు షూటింగ్ పెండింగ్ లో ఉంది. సెకండ్ వేవ్ అడ్డంకుల్ని దాటుకొని వచ్చిన ఈ సినిమా, ధర్డ్ వేవ్ కు దొరికిపోయింది. దీంతో సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయింది. దీనికితోడు తాజాగా జరిగిన షూటింగ్ కు సంబంధించి రష్ చూసిన మహేష్.. చాలా సన్నివేశాలు రీషూట్స్ చెప్పడంతో, సినిమా విడుదల వాయిదా వేయడం అనివార్యమైంది.
ఈ కారణాలతో పాటు మహేష్ కు కరోనా సోకడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఆయన కనీసం మరో నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నాడట. దీంతో ఆ తేదీని ఆచార్య మేకర్స్ కు ఇచ్చేశాడు మహేష్.