మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట దెబ్బకు ఇప్పటికే ఓ మంచి సినిమా అశోకవనంలో అర్జున కల్యాణం బుక్కయింది. మహేష్ మూవీకి సరిగ్గా వారం ముందొచ్చిన ఆ సినిమాకు ఇప్పుడు థియేటర్లు కరువయ్యాయి. ఇప్పుడీ సినిమా దెబ్బకు మరో మూవీ బుక్కయింది. అదే డాన్ మూవీ.
శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా డాన్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది ఈ సినిమా. అయితే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70శాతం థియేటర్లు సర్కారువారి పాటకే కేటాయించారు. కొన్ని థియేటర్లలో ఆచార్య, కేజీఎఫ్2 ఆల్రెడీ ఉన్నాయి. దీంతో అతి కొద్ది థియేటర్లలో మాత్రమే రిలీజైంది డాన్ సినిమా.
అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో ఈ సినిమా చూడాలంటే మాత్రం మెయిన్ థియేటర్లలో కనిపించడం లేదు. సర్కారువారి పాట వల్ల జరిగిన ప్రమాదం ఇది. అదే మామూలు రోజుల్లో డాన్ రిలీజై ఉంటే, శివ కార్తికేయన్ గత మూవీ డాక్టర్ తరహాలో ఇక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకునేది.
వారం కిందట రిలీజైన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాది కూడా ఇదే పరిస్థితి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ మరో వీకెండ్ వచ్చేలోపే థియేటర్లు తగ్గిపోయాయి. దీంతో సినిమా హిట్టయినా, వసూళ్లు రాని పరిస్థితి.
ఓ పెద్ద సినిమా వచ్చినప్పుడు మరో చిన్న సినిమాకు అన్యాయం జరగడం సహజం. కాకపోతే అలా వచ్చిన చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి సరిపోయింది. కానీ ఈసారి పరిస్థితి వేరు. చిన్న సినిమా బిట్టయినా పెద్ద సినిమా ముందు నిలవలేకపోయింది.