సర్కారువారి పాట సినిమాకు సంబంధించి హీరో మహేష్ బాబు ఓ కీలకమైన షెడ్యూల్ పూర్తిచేశాడు. ఈ మూవీ క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ ను నిన్నటితో కంప్లీట్ చేశాడు మహేష్. రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ స్టుడియోస్, అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో సర్కారువారి పాట క్లైమాక్స్ షూటింగ్ జరిగింది.
సర్కారువారి పాట షూటింగ్ మందకొడిగా సాగింది. రెండు సార్లు కరోనా ప్రభావం చూపించడంతో ఈ సినిమా ఆలస్యమైంది. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మహేష్ బాబు కూడా గ్యాప్ తీసుకున్నాడు. అలా దశలవారీగా జరిగిన సినిమా షూటింగ్ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. మరో 10-15 శాతం టాకీ మాత్రమే పెండింగ్ ఉంది. ఈ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది.
మహేష్, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోంది సర్కారువారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తిచేసి, రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్నాడు మహేష్ బాబు. చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆ ప్రాజెక్టు కోసం కనీసం ఏడాది పాటు టైమ్ కేటాయించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ రిలీజైన వెంటనే, మహేష్ బాబు సినిమా పనిలో పడతాడు రాజమౌళి.