రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఈ క్రమంలో పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులైన సయ్యద్ మొబిన్, మసూద్ అహ్మద్ పథకం ప్రకారమే నాగరాజును హత్య చేశారని పోలీసులు తేల్చారు.
ఎల్బీనగర్ కోర్టు ఇద్దరు నిందితులను 5 రోజుల కస్టడీకి అంగీకరించగా.. చర్లపల్లి జైలులో ఉన్న మోబిన్, మహ్మద్‌లను పోలీసులు ప్రశ్నించారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఇద్దరే హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు పేర్కొన్నారు. నాగరాజు ఎక్కడున్నాడో జీమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి గుర్తించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇద్దరు నిందితుల కాల్ డేటా రికార్డింగ్స్ సేకరించారు. హత్య ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులతో తప్ప నిందితులు ఎవ్వరితో మాట్లాడలేదని పోలీసులు తెలిపారు.
అలాగే, నాగరాజు కదలికలను తెలుసుకునేందుకు మొబైల్ ట్రాకర్ అప్లికేషన్‌ను ఉపయోగించారన్న అనుమానం నిజమైనట్టు తెలిపారు. మసూద్ తన ఈమెయిల్ లాగిన్‌కు ఐడీ, పాస్వర్డ్‌కు తన మొబైల్ నంబర్‌నే పెట్టుకున్నాడని.. అదే ట్రిక్‌ను నాగరాజు మెయిల్‌ను హ్యాక్ చేసేందుకు మసూద్ ప్రయోగించాడని పోలీసులు తెలిపారు. అది వర్కౌట్ కావడంతో జీమెయిల్ ద్వారా ఫైండ్ మై డివైస్‌లోకి వెళ్లి లొకేషన్‌ను నిందితులిద్దరూ కనుక్కున్నట్లు వెల్లడించారు. నిందితులిద్దరికీ ఏ సంస్థతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేసిన పోలీసులు.. వాళ్లను కోర్టులో హాజరుపరిచారు.
సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే బైక్ పై వెళ్తున్న నాగరాజును అత్యంత దారుణంగా హత్య చేశారు నిందితులు. నాగరాజు తలకు హెల్మెట్ పెట్టుకొన్నప్పటికీ ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ సమయంలో ఆశ్రిన్ దాడి చేయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసింది. నాగరాజును చంపిన వారిలో ఆశ్రిన్ సోదరుడితో పాటు బావను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు