వనపర్తి జిల్లా ఆత్మకూర్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆత్మకూర్ లో దళితులపై సర్పంచ్ భర్త, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో సర్పంచ్ భర్తపై కేసు నమోదు చేయాలని దళితులు డిమాండ్ చేశారు.
అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిన్నంచర్ల గ్రామ దళితులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. దాడి జరిగి 5 రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు.
దాడికి పాల్పడిన వ్యక్తి ఆయన అనుచరులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చుకున్నారు.
ఆందోళనలో వామపక్ష పార్టీల నాయకులు విజయరాములు, అజయ్, ఎస్ రాజు, సీ రాజు, ఆర్ఎన్ రమేష్, కురుమూర్తి, ప్రసాద్, శ్యామ్ సుందర్, ప్రజా సంఘాల నాయకులు విజయ్ లతో పాటు పిన్నంచర్ల గ్రామ దళితులు తదితరులు పాల్గొన్నారు.