సమస్యలపై ప్రశ్నిస్తే.. అధికార పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. మాటలతో సమాధానం చెప్పకుండా.. దాడులతో సమాధానం ఇస్తున్నారు. మంత్రి స్థాయి నుంచి… గ్రామ సర్పంచ్ వరకూ అందరూ అదే బాటపడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం దామస్తాపూర్ సర్పంచ్ కూడా అలాగే బరితెగించాడు.
గ్రామంలోని సమస్యలపైన ప్రశ్నించడాన్ని తట్టుకోలేని సర్పంచ్ జైపాల్ రెడ్డి.. స్థానికుడిపై పిట్టల శ్రీనివాస్‌పై దాడికి దిగాడు. పిడిగుద్దులు కురిపిస్తూ.. గాల్లోకి ఎగిరెగిరి తన్నాడు. నీటి సమస్య, డ్రైనేజి సమస్యలను పరిష్కరించమని కోరడమే బాధితుడు పాపమైంది. సమస్యలు తీర్చమని అడిగినందుకే ఇంతలా రెచ్చిపోతే.. ఇక అక్రమాల, అవినీతి గురించి ప్రశ్నిస్తే చంపేస్తారేమోనని పిట్టల శ్రీనివాస్ వాపోయాడు. సర్పంచ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఘటనపై మార్పల్లి ఎస్సై వెంకటేష్‌ను వివరణ కోరగా శ్రీనివాస్ ఇచ్చిన కంప్లీట్ ప్రకారం వివరాలు పరిశీలించి.. కేసు దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.