అతనో సర్పంచ్. గ్రామ ప్రథమ పౌరునిగా అందరికీ ఆదర్శంగా వుండాల్సిన వ్యక్తి. కానీ పింఛన్ డబ్బుల కోసం దిగజారి పోయాడు. తన తల్లి మరణించిన విషయాన్ని దాచి పెట్టి పింఛన్ డబ్బులు డ్రా చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేండ్లు అలా డ్రా చేసుకుంటూ వచ్చాడు.
చివరకు విషయం బయటకు రావడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే…ఆలంపూర్ మండలం ఉట్కూర్ సర్పంచ్ అయ్యస్వామి తల్లి మద్దెల లింగమ్మ 2019లో మరణించారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పకుండా ఆయన 47 నెలలుగా పింఛన్ డబ్బులు డ్రా చేసుకుంటున్నాడు
లింగమ్మ మరణించినప్పటికీ ప్రతి నెలా ఆసరా పింఛను డ్రా అవుతున్నట్టు గ్రామస్తులు గుర్తించారు. దీంతో ఈ విషయంపై జిల్లా అదనపు కలెక్టర్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ ప్రారంభించారు.
గ్రామంలో స్థానికులను జిల్లా అధికారులు విచారణ చేశారు. విచారణలో అదంతా నిజం అని తేలడంతో సర్పంచ్ అయ్య స్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి కవితను అధికారులు సస్పెండ్ చేశారు.