మొన్న జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి రాజీనామా విషయం చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేయాల్సి వచ్చిందని మీడియా ముందు ఆమె బోరున ఏడ్చేశారు. ఈ వివాదంపై ఇంకా చర్చ జరుగుతుండగానే.. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధింపుల బాగోతం వెలుగుచూసింది. ఈసారి ఏకంగా సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామానికి సర్పంచ్ గా ఉన్నారు వాణి. ఈమె అప్పులు తెచ్చి మరీ గ్రామాభివృద్ధి చేశారు. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచి తర్వాత బీఆర్ఎస్ లో చేరారు ఈమె. అయితే.. ఉప సర్పంచ్, పాలక మండలి వాణీకి సహకరించడం లేదు. దీంతో బిల్లులు రాని పరిస్థితి. ఏం చేయాలో పాలుపోక.. భర్తతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్ కు వెళ్లారు.
కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు ఇద్దరు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మద్దతుతో పాలక మండలి ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోతున్నామని వాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అప్పులిచ్చిన వారు తిరిగివ్వాలని ఒత్తిడి చేస్తుండటంతో మనస్థాపం చెంది ఇలా చేయాల్సి వచ్చిందని వాపోయారు.
బిల్లులు మంజూరు చేయడంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకరించడం లేదని సర్పంచ్ వాణి ఆరోపించారు. కోటిన్నర లక్షలకు మిత్తితో కలిపి మూడు కోట్లకు పైగా అప్పు అయిందని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కలెక్టరేట్ ఎదుట కూర్చున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించగా.. వీరిద్దరిని పోలీసులు అడ్డుకున్నారు.