ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సొంత జిల్లాలోనే భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్‌కు చెందిన సర్పంచులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
పల్లె ప్రగతి పేరుతో ఉరుకులు, పరుగుల మీద సర్పంచులతో వివిధ అభివృద్ధి పనులు చేయించి, చేయనివారిని సస్పెండ్ చేస్తామని బెదరించిన ప్రభుత్వం.. ఆయా పనులకు సంబంధించి నిధులని మాత్రం ఇవ్వలేదు. పదవి పోతుందన్న భయంతో సర్పంచులు దొరికినచోటల్లా అప్పులు చేసి.. అభివృద్ధి పనులు చేశారు. అయితే నెలలు గడిచినా ప్రభుత్వం బిల్లులని చెల్లించకపోవడంతో , అప్పుల భారం పెరిగిపోయి కొంత మంది సర్పంచులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. మరికొందరు సర్పంచులు వాటిని తీర్చేందుకు ఏకంగా కూలీ పనులకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన టీఆర్ఎస్ సర్పంచులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అక్కన్నపేట మండలంలో మొత్తం 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 28 మంది టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులే ఉన్నారు. వీరిలో 21 మంది టీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన చేయాలని భావిస్తున్నారు. తమ రాజీనామాలతోనైనా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సర్పంచుల సమస్యల తీవ్రత ఏమిటో అర్థం అవుతుందనే ఆలోచనతో పార్టీకి గుడ్‌బై చెప్తున్నామని అంటున్నారు.