నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే పంపిణీ చేయాల్సిన కల్యాణలక్ష్మి చెక్కులను టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తో పంపిణీ చేయించడాన్ని ఖండిస్తూ.. మండలంలోని కాంగ్రెస్ సంర్పంచ్ లు నిరసన వ్యక్తం చేశారు.
కాగా.. ఇటీవల మండల వ్యాప్తంగా 103 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి తహసీల్దార్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చెక్కులు చేశారు. అయితే.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పంపిణీ చేయాల్సిన చెక్కులను.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో ఎందుకు పంపిణీ చేయించారని నిలదీశారు.
నిబందనలకు విరుద్దంగా తహసీల్దార్ వ్యవహరిస్తూ.. మాజీ ఎమ్మెల్యే తో పంపిణీ చేయించారని ఆరోపించారు. కాగా.. మండలంలో మొత్తం 20 గ్రామాలు ఉండగా.. అందులో 16 గ్రామాలకు కాంగ్రెస్ సర్పంచులు ఉన్నారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాదని.. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో చెక్కుల పంపిణీ చేయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు.
నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించిన తహసీల్దార్ పుష్పలతను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేరుకున్నారు. వారి ధర్నాను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో మండలంలోని 16 గ్రామాల కాంగ్రెస్ సర్పంచ్ లు పాల్గొన్నారు.