రోజూ ఎక్కడో ఒకచోట సర్పంచుల నుంచి తిరుగుబాటు వినిపిస్తోంది. బిల్లులు రాక..అప్పులు తీర్చలేక.. వడ్డీలు కట్టలేక ప్రభుత్వాన్నినిలదీస్తున్నారు వారంతా. సొంత పార్టీ సర్పంచులే నిరసన స్వరం వినిపిస్తుండడంతో టీఆర్ఎస్ కు కష్టకాలం మొదలైందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా కేసీఆర్ ఇలాకాలోని సర్పంచులు నిరసన గళాన్ని వినిపించారు.
ప్రస్తుతం రాష్ట్రమంతా పల్లె ప్రగతి సమీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులను సర్పంచులు నిలదీస్తున్నారు. బిల్లుల డబ్బులు రాకపోతే తాము ఎట్లా బతకాలని అడుగుతున్నారు. ఈ క్రమంలోనే గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండల సర్పంచులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించారు.
బిల్లులు చెల్లించి స్పెషల్ ఫండ్ ఇస్తేనే పల్లె ప్రగతికి హాజరవుతామని స్పష్టం చేశారు సర్పంచులు. మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అన్నిపంచాయతీల సర్పంచులు ఆందోళనకు దిగారు.గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేసేదాకా వెనక్కి తగ్గేది లేదని సమీక్షను బహిష్కరించారు.ఆత్మగౌరవం లేకుండా చేస్తే సహించేది లేదని..సర్పంచుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీఎం నియోజకవర్గంలోనే తిరుగుబాటు రావడం చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే పలు మండలాల్లోని సర్పంచులు ఏకమై మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.