స్వాతంత్య్ర సమరయోదుడు, వినోబాబావే భూదాన్ పోచంపల్లిలో చేపట్టిన భూదాన్ కార్యక్రమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఇక్కడి నుంచి సర్వోదయ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. వినోబా బావే స్వగ్రామం అయిన మహారాష్ట్రలోని సేవగ్రామ్ వరకు 600 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది.
భూదాన్ పోచంపల్లిలో ప్రారంభమైన పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
దేశంలోని భూస్వాముల నుంచి 45 లక్షల ఎకరాలు సేకరించి పేదలకు పంచిన ఏకైక వ్యక్తి వినోబాబావే అని భట్టి విక్రమార్క కొనియాడారు. భూదాన కార్యక్రమానికి రామచంద్రారెడ్డి పోచంపల్లి నుంచే శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సర్వోదయ సంకల్ప పాదయాత్ర ద్వారా.. టీఆర్ఎస్ పాలన, దోపిడీ గురించి ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు
పేదల భూములను లాక్కోవద్దని ప్రభుత్వాలను ఎమ్మెల్యే సీతక్క హెచ్చరించారు. వినోబాబావే స్ఫూర్తితో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములు పంపిణీ చేసిందని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పంచిన భూములను ధరణి పోర్టల్ లోకి ఎక్కించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు సీతక్క.