అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు స్వేచ్ఛ లభించనుంది. అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న ఆమె శిక్షా కాలం నేటితో ముగుస్తోంది. నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళను ఇవాళ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా విక్టోరియా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె విడుదలకు అక్కడే కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో.. జైలు నుంచి విడుదలైనప్పటికీ.. శశికళ ఆస్పత్రిలోనే ఉంటారని తెలుస్తోంది.జనవరి 20న శశికళకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.దీంతో ఆమె డిశ్చార్జి ఎప్పుడనేదానిపై వైద్యులు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. అన్నింటికి సాధారణంగానే స్పందిస్తున్నారని వైద్యులు బులెటిన్‌లో వెల్లడించారు.