ఓటీటీ ఊపందుకున్న తర్వాత నిర్మాతలంతా పండుగ చేసుకున్నారు. అప్పటివరకు వాళ్లకు శాటిలైట్ రైట్స్ మాత్రమే దిక్కు. కానీ.. ఓటీటీ వచ్చిన తర్వాత శాటిలైట్ కంటే ఎక్కువగా మంచి రేట్లు రావడం మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలు కూడా అమ్ముడుపోయాయి. దీంతో నిర్మాతలంతా ఇలా సినిమా స్టార్ట్ చేయడం, అలా ఓటీటీ రైట్స్ అమ్మేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.
అయితే.. ఇప్పుడీ పప్పులు ఉడకవు. మొన్నటివరకు నిర్మాతలు ఓటీటీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఫర్వాలేదు. కానీ.. ఇప్పుడు డబ్బుల కోసం ముందుగానే ఓటీటీతో అగ్రిమెంట్లు చేసుకుంటే మాత్రం, శాటిలైట్ డీల్స్ అవ్వకపోవచ్చు. ఈ మేరకు ఛానళ్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ఓటీటీ రైట్స్ లేకపోతే, శాటిలైట్ హక్కులు తీసుకోకూడదని జీ తెలుగు ఛానెల్ నిర్ణయించుకుంది. శాటిలైట్+డిజిటల్ కలిపి ఉంటనే ఏ సినిమానైనా కన్సిడర్ చేయాలని డిసైడ్ అయింది. అటు స్టార్ మా ఛానెల్ కూడా అదే పద్ధతిలోకి మారింది. డిస్నీ హాట్ స్టార్ కోసం ఓటీటీ, ఛానెల్ కోసం శాటిలైట్.. రెండూ ఉంటేనే సినిమాలు తీసుకుంటోంది.
ఇలా 2 కీలకమైన ఛానళ్లు నిర్ణయం తీసుకోవడంతో నిర్మాతలు ఇరుకునపడ్డారు. ఇంతకుముందు సినిమా మొదలైన వెంటనే ఓటీటీ రైట్స్ ను అమెజాన్ కు లేదా నెట్ ఫ్లిక్స్ కు ఇచ్చేసేవారు. ఇప్పుడలా ఇస్తే ఓన్లీ శాటిలైట్ అమ్ముడుపోదు. ఉదాహరణకు విరాటపర్వం సినిమానే తీసుకుంటే, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇప్పటివరకు అమ్ముడుపోలేదు. శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాది కూడా ఇదే పరిస్థితి. అంతెందుకు.. ఆచార్య సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ చేయడానికి నిర్మాతలు కిందామీద పడ్డారు. సో.. నిర్మాతలంతా ఇప్పుడు ఓటీటీ డీల్ క్లోజ్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే.