మిత్రుల మధ్య తిరుపతి పంచాయితీ తేలినట్లు లేదు. అందుకే దాని కోసం ఢిల్లీ రాలేదంటూ జనసేనాని వివరణ ఇచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం గట్టిగానే పట్టుబట్టినట్లు తెలుస్తోంది. పైగా అమరావతి, పోలవరంలపై చర్చించామని.. ఏపీలో బిజెపి, జనసేన కలిసి అధికారంలోకి ఎలా రావాలో చర్చించామని చెప్పారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో పవన్ పర్యటన ఎప్పుడనేది తేలలేదు. మొత్తం మీద అర్ధమవుతుంది ఏంటంటే.. బిజెపి తిరుపతి సీటును జనసేనకు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదని.. అదే సమయంలో జనసేన సైతం తన పట్టును సడలించుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది.
తిరుపతి సీటు కోసమే పవన్ ఢిల్లీ వెళ్లారన్నది స్పష్టం. అది తేలలేదు కాబట్టే.. వేరే విషయాలు చెబుతున్నారనే కామెంట్లు వస్తున్నాయి. అయితే సాధారణంగా రాజీపడిపోయే పవన్ కల్యాణ్.. ఈసారి అంత పట్టుబట్టడమే ఆశ్చర్యకరం. ఇప్పుడు కూడా మరో రెండురోజుల్లో తిరుపతి అభ్యర్ధిపై నిర్ణయం అని చెప్పినా.. రెండు రోజుల తర్వాత విశాల ప్రయోజనాల దృష్ట్యా బిజెపియే పోటీ చేస్తుందని.. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో చెప్పినా చెప్పొచ్చు. కాని ఇన్ని రోజులు దాని కోసం పట్టుబట్టడమే పవన్ పద్ధతికి విరుద్ధం. గ్రేటర్ హైదరాబాద్ లో పవన్ పర్యటన చేస్తారని బిజెపి ఇప్పటికే ప్రకటించింది. కాని ఎప్పుడనేది చెప్పలేకపోయింది. ఎందుకంటే పవన్ డేట్స్ ఇవ్వలేదు. పవన్ తిరుపతి సంగతి తేలాకే ప్రచారానికి వెళ్లాలని డిసైడ్ అయ్యారనే ప్రచారం జరిగింది.
బిజెపి నేతలు సైతం.. బిజెపి జనసేనలు కలిసి తిరుపతిలో పోటీ చేస్తాయని.. అభ్యర్ధి ఎవరనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనే చెప్పారు. అంటే జనసేనకు ఇంకా అవకాశాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇరు పార్టీలు బయటపడలేదు, కాని లోపల ఏం జరిగిందో తెలియదు. కాకపోతే వచ్చింది తిరుపతి సీటు కోసం కాదని జనసేన నేతలు చెప్పటంతోనే.. అక్కడ నో చెప్పారా అనే డౌట్లు వస్తున్నాయి.
వారు పైకి చెప్పిన అమరావతి, పోలవరం, దేవాలయాలపై దాడుల అంశాలు.. కొత్తవి కావు. వాటిపై విధానంలో వచ్చిన మార్పేమి లేదు. అమరావతి ఉండాలంటూనే.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామంటూనే.. అమరావతి అక్కడే ఉండేలా పోరాటం చేస్తామని గాని.. రైతుల ఉద్యమంలో పాల్గొంటామని గాని చెప్పటం లేదు. అలాగే పోలవరం మీద సైతం అదే ధోరణి. కాబట్టి అవి కేవలం కవరింగ్ కోసం చెప్పినవనే అనుకోవాలి. తిరుపతి సీటు విషయంలో పవన్ రాజీపడ్డారా లేదా అన్న విషయం మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.