ఇద్దరూ ప్రత్యర్ధులే. కాని ఒకరి మీద మిస్సైల్స్ వదిలారు. వదిలిపెట్టేది లేదన్నట్లు చెలరేగిపోయారు. కాని మరో ప్రత్యర్ధి మీద మాత్రం.. ఉల్లిపాయ బాంబు కూడా వేయలేదు. రోజా మేడమ్ మాట్లాడిందంటే.. నాన్ స్టాప్ క్రాకర్స్ పేలాల్సిందే. పవన్ మీద మాట్లాడితే ఇక చెప్పనక్కర్లేదు. కాని బిజెపి మీద మాత్రం కాకరపూవత్తు కూడా వెలిగించటం లేదు. అంత ఢిఫరెన్సు ఏంటో.. ఆ డిఫరెన్సు వెనక కథేంటో అందరికీ ఇప్పటికే అర్ధమైపోయే ఉంటుంది. తిరుపతి ఉప ఎన్నికల హీట్ అప్పుడే మొదలైంది. టీడీపీ, వైసీపీలు అభ్యర్ధులను ప్రకటించాయి. అందరికంటే ముందు పోటీకి సిద్ధమన్న బిజెపి మాత్రం ఇంకా తేల్చలేదు. మరోవైపు జనసేనాని పవన్ సైతం తమకు అవకాశం ఇవ్వమని అడుగుతుండటం.. ఇంకా ఏ సంగతి తేలలేదు. అయితే ఇరు పార్టీలు అధిష్టానానికే నిర్ణయాన్ని వదిలేశాయి. వారు ఎవరంటే వారు పోటీ చేస్తారని చెప్పేశారు. పవన్ కోరికను మన్నించే అవకాశాలు కనపడుతున్నాయి.
ఎందుకంటే ఇక్కడ బిజెపి కన్నా జనసేనకే అవకాశాలు ఎక్కువనే వాదనలు ఉన్నాయి. జనసేన ఆర్డనైజేషన్ పరంగా వెరీ పూర్.. వారికి బిజెపి తోడైతే.. టీడీపీ కూడా పరోక్షంగా సహకరించే అవకాశాలున్నాయనే కామెంట్లు వస్తున్నాయి.
అందుకే రోజా పవన్ పై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బిజెపికి మద్దతివ్వమని ప్రకటించిన పవన్ ను.. అసలు అలా అయినప్పుడు పార్టీ ఎందుకు పెట్టినట్లు అని ప్రశ్నించారు. ఏం బేరాలాడటానికి ఢిల్లీ వెళ్లి కూర్చున్నారంటూ నిలదీశారు. విషయం ఏంటంటే.. జీహెచ్ఎంసీలో బిజెపికి మద్దతు ఎందుకన్న నోటితోనే.. ప్రచారం చేయకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్లారని అడిగింది రోజమ్మా.
పవన్ కల్యాణ్ ఆయన సామాజికవర్గం ఉన్న నియోజకవర్గాలు రెండిటిలో పోటీ చేసినా గెలవలేదని.. తిరుపతిలో మాత్రం జనసేన అభ్యర్ధి ఎలా గెలుస్తారని సెటైర్ విసిరింది రోజా. బిజెపి తిరుపతిలో విజయం కోసం ఆశపడటంలో తప్పు లేదట.. ఇది కూడా రోజాయే చెప్పింది. ఇవన్నీ వింటుంటే ఏమర్ధవుతోంది? జనసేన అయితే వద్దు.. బిజెపి అయితే ముద్దు. బిజెపి అయితే వైసీపీకి సహకరిస్తారు.. లోకల్ వాళ్లు వినకపోయినా.. అదెలా చేయాలో సోము వీర్రాజుగారికి బాగా తెలుసు. జనసేన అయితే.. టీడీపీ వారికి సహకరించే అవకాశం ఉంది, అప్పుడు వైసీపీ విజయావకాశాలు పడిపోతాయి. అందుకే జనసేనకు అవకాశాలు లేవు.. పవన్ కు అంత సీను లేదు లాంటి డైలాగులు విసిరితే.. ఒక వేళ బిజెపి ఏమైనా జనసేనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే ఆలోచన ఉన్నా వెనక్కి పోతుందని.. ఒకవేళ తీసుకున్నా.. జనంలో జనసేనకు హైప్ రాకుండా చేయాలనే ఇలాంటివి మాట్లాడుతున్నారు.
ఏపీ బిజెపి, వైసీపీ మధ్య ఉన్న మిత్రబంధం తిరుపతిలో దెబ్బ తినకుండా ఉండాలనే తాపత్రయంలో వైసీపీ.. అలాగే బిజెపిలోని కొందరు నాయకులు ఉన్నారు. అందుకే అక్కడ జనసేనను అడుగు పెట్టనీయకుండా చూడాలనే ఆలోచనలో ఉన్నారని రోజా వ్యాఖ్యలు వింటుంటే అర్ధమవుతోంది.