న్యూస్ లాండ్రీ అనే ఓ సైట్ మీద టైమ్స్ గ్రూప్ రూ.100 కోట్లకు నష్టపరిహారం దావా వేసింది. సదరు వెబ్‌సైట్ నిర్వాహకులు టైమ్స్ గ్రూప్‌కు చెందిన యాంకర్లపై సెటైరికల్ వీడియోలు సృష్టించి వాటిని తమ యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశారని, అలాగే వాటికి చెందిన కథనాలను ఆ వెబ్‌సైట్‌లో రాశారని.. అవి తమను కించ పరిచేలా ఉన్నాయని చెబుతూ.. టైమ్స్ గ్రూప్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది.
తోడీస్ బనేగా తూ: టీవీ న్యూసెన్స్ అనే వీడియోతోఊపాటు ఎక్స్‌ప్లెయిన్డ్: హౌ టు రిగ్ టీఆర్‌పీస్ అనే రెండు వీడియోలను న్యూస్ లాండ్రీ పబ్లిష్ చేసింది. ఆ వీడియోలను గతేడాది యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేయగా, వాటికి చెందిన కథనాలను న్యూస్ లాండ్రీ సైట్‌లో ప్రచురించారు.
అయితే ఆయా వీడియోల్లో టైమ్స్ నౌ యాంకర్లు రాహుల్ శివశంకర్, నవికా కుమార్ లను అవమానించారని, ఆ వీడియోల వల్ల తమ సంస్థ ప్రతిష్ట దెబ్బ తింటుందని చెబుతూ టైమ్స్ గ్రూప్ పిటిషన్‌లో పేర్కొంది. ఇక అందులో మొదటి వీడియోలో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం, రియా అరెస్టు వంటి అంశాలను చూపించగా, రెండో వీడియోలో టీఆర్‌పీలను ఎలా మానిపులేట్ చేయవచ్చు.. అనేదాన్ని వ్యంగ్యంగా చూపించారు. ఈ క్రమంలోనే ఆ వీడియోలు తమ సంస్థ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని టైమ్స్ గ్రూప్ తన పిటిషన్ లో పేర్కొంది.
ఇక ఈ విషయంపై అటు న్యూస్ లాండ్రీ నిర్వాహకులు స్పందించారు. తమది ఓ చిన్న మీడియా సంస్థ అని, బెన్నెట్, కోల్‌మన్ అండ్ కంపెనీ లిమిటెడ్ అంత పేరుగాంచిన కంపెనీ తమ లాంటి చిన్న మీడియా సంస్థపై ఇలా కేసు వేయడం దారుణమని, తాము ఎన్నడూ హద్దులు మీరి ప్రవర్తించలేదని, డబ్బు కోసం ఇదంతా చేయడం లేదని తెలిపారు. ఈ క్రమంలో టైమ్స్ గ్రూప్ వేసిన పిటిషన్‌ను కోర్టు ఈ నెల 22వ తేదీన విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.