ఇటీవల మరణించిన ప్రముఖ నటుడు, డైరెక్టర్ సతీష్ కౌశిక్ పై విష ప్రయోగం జరిగిందా? ఆయనను హత్య చేశారా ? దిగ్భ్రాంతికరమైన ఈ విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేరు మోసిన బిజినెస్ మన్, పాన్ మసాలా ‘కుబేరా గ్రూప్’ డైరెక్టర్ వికాస్ మాలు రెండో భార్య శాన్వి మాలు.. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. తన భర్త వికాస్.. సతీష్ కౌశిక్ ని హత్య చేశారని ఆమె ఆరోపించారు. కౌశిక్ మృతి అనుమానాస్పదంగా ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆమె కోరినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను త్వరలో పిలిచి ఆమె వాంగ్మూలాన్ని సేకరిస్తామని వారు చెప్పారు. సతీష్ కౌశిక్ తనభర్తకు రూ. 15 కోట్లు అప్పుగా ఇచ్చారని, వికాస్ నుంచి ఈ సొమ్మును రాబట్టేందుకు ఒకసారి విదేశాల్లో ఆయనను కలిశారని శాన్వి తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగిందని, మీ అప్పు తీర్చేస్తానని వికాస్ ఆయనకు హామీ ఇచ్చాడని ఆమె వెల్లడించారు.
తన భర్త ఫామ్ హౌస్ లో నిర్వహించిన హోలీ పార్టీకి సతీష్ కౌశిక్ హాజరైనప్పుడు అస్వస్థుడయ్యారని.. .. బహుశా ఆ సమయంలో ఆయనపై విష ప్రయోగం జరిగి ఉంటుందని తాను అనుమానిస్తున్నానని ఆమె అన్నారు. కౌశిక్ కి అప్పు ఎగవేసేందుకు వికాస్ కుట్ర పన్నినట్టు ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే సతీష్ కౌశిక్ మృతిలో అనుమానాస్పద అంశాలేవీ కనిపించలేదని, ఆయన గుండెపోటుతో మరణించారని అటాప్సీ రిపోర్టు పేర్కొందని పోలీసులు అంటున్నారు. కౌశిక్ కుటుంబ సభ్యులెవరూ కూడా ఇప్పటివరకు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ వికాస్ కు చెందిన ఫామ్ హౌస్ ని పోలీసులు సెర్చ్ చేసినప్పుడు వారికి కొన్ని ‘మందులు’ లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. కౌశిక్ మృతికి కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు వివరణాత్మక పోస్ట్ మార్టం రిపోర్టు కోసం తాము వేచి చూస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక తన భర్త వికాస్ తనపై అత్యాచారం చేశాడని గత ఏడాది శాల్వి ఆరోపించారు. ఏది ఏమైనా పోలీసులు ..కౌశిక్ మృతిపై మళ్ళీ దర్యాప్తు ప్రారంభించారు.