కాలం కలిసిరాకపోతే ఇలానే ఉంటుంది. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా హీరోగా రాలేకపోతున్నాడు సమీర్. ఇతడు మరెవరో కాదు, స్వయానా దర్శకుడు సతీష్ వేగేశ్న తనయుడు. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ సపోర్ట్, ఇండస్ట్రీలో మంచి పేరు ఉండి కూడా కొడుకును హీరోగా పరిచయం చేయలేకపోయాడు ఈ దర్శకుడు. తప్పనిసరి పరిస్థితుల మధ్య వెబ్ సిరీస్ తో కొడుకును పరిచయం చేస్తున్నాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. సమీర్ వేగేశ్నను హీరోగా పరిచయం చేయడానికే సిద్ధపడ్డాడు సతీష్ వేగేశ్న. ఈ మేరకు కోతికొమ్మచ్చి అనే కామెడీ సబ్జెక్ట్ కూడా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సెట్స్ పైకి వెళ్లాడు.
ఒక హీరోగా తన కొడుకును, మరో హీరోగా శ్రీహరి కొడుకు మేఘాంష్ ను తీసుకొని సినిమా స్టార్ట్ చేశాడు. షూటింగ్ కూడా పూర్తిచేశాడు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కు వచ్చేసరికి నిర్మాత చేతులెత్తేశాడు. తన దగ్గర డబ్బు లేదంటున్నాడట.
దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి, కొడుకు కోసం ఆంథాలజీ వెబ్ సిరీస్ ను భుజానికెత్తుకున్నాడు సతీష్ వేగేశ్న. అలా వెండితెరకు పరిచయం అవ్వాల్సిన సమీర్.. ఓటీటీకి పరిచయమౌతున్నాడు.