తనకు హైదరాబాదీ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ చెప్పకనే చెప్పారు. ‘చాట్ జీపీటీ’ తో సరదాగా చాట్ చేస్తూ ఆయన .. ఈ నగర బిర్యానీని సౌత్ ఇండియన్ డిషెస్ లో చేర్చడాన్ని తాను ఒప్పుకోనన్నారు. ఇంతకీ ‘చాట్ జీపీటీ’ అంటే ? ఇది శాన్ ఫ్రాన్సిస్కో లో ‘ఓపెన్ ఐ’ అనే కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన సాఫ్ట్ వేర్. దక్షిణ భారత దేశంలో పాపులర్ అయిన టిఫిన్ ఐటెం లను తెలపాలని సత్య నాదెళ్ల.. ఈ సాఫ్ట్ వేర్ ని కోరగా.. అది ఇడ్లీ, వడ, దోసె వంటి వాటి పేర్లను పేర్కొంటూ ఆ జాబితాలో ‘హైదరాబాదీ బిర్యానీ’ ని కూడా చేర్చింది.
కానీ ఇందుకు అంగీకరించని సత్య నాదెళ్ల.. దీన్ని టిఫిన్ అని వ్యవహరించడం ద్వారా తన తెలివి తేటలను అవమానించినట్టే అవుతోందని వ్యాఖ్యానించారు. హైదరాబాదీ అయిన తాను విభేదిస్తున్నానని అన్నారు. ఆయన అలా అనగానే ఈ సాఫ్ట్ వేర్ ఆయనకు క్షమాపణ చెప్పింది. పైగా ..’మీరు చెప్పింది వాస్తవమే.. దక్షిణ భారతంలో దీన్ని టిఫిన్ డిష్ గా వర్గీకరించలేదు’ అని కూడా పేర్కొంది.
బెంగుళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్ లో .. ఇండియాలో కొనసాగుతున్న అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్లౌడ్ ఆవిష్కరణల గురించి సత్య నాదెళ్ల తన ప్రెజెంటేషన్ ఇచ్చారు.. టెక్నాలజీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఈ సరదా సంభాషణ సాగింది.
ఇది అక్కడితో ఆగలేదు.. తమలో ఏది బెస్ట్ టిఫిన్ అన్న అంశంపై ఇడ్లి, దోసె, వడ మధ్య జరిగిన వివాదం మీద ఓ డ్రామాను సృష్టించాలని ఆయన చాట్ జీపీటీని కోరడం, షేక్స్ పియర్ నాటకంలోని భాగంమాదిరి పిండికి, సాహిత్యానికి మధ్య డైలాగ్ ని రూపొందించాలని సూచించడం వంటివి ఆద్యంతం అక్కడివారికి నవ్వుల పువ్వులు పూయించాయి. ఇలాంటి మోడల్ లు ప్రజల ఊహలను ఎలా ఆకర్షిస్తాయో చూడడం సరదాగా ఉంటుందని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు.