ప్రతిష్టాత్మకమైన ఫార్ఛూన్స్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ -2019 జాబితాలో భారతీయుడు, మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల అందరి కంటే టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఆయనతో పాటు ఆ జాబితాలో మరో ఇద్దరు భారతీయులైన మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా, అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ లకు స్థానం దక్కింది. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగాలకు చెందిన 20 మందిని ఫార్ఛూన్స్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేస్తారు. సాహసోపేతమైన లక్ష్యాలు, అనితర సాధ్యమైన విజయాలు, సృజనాత్మకతతో కూడిన పనితనం కనబర్చిన వారిని ఈ జాబితాకు ఎంపిక చేస్తారు.
హైదరాబాద్ కు చెందిన సత్య నాదెళ్ల సాప్ట్ వేర్ రంగంలో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన మైక్రోసాప్ట్ సంస్థకు 2014 లో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కంప్యూటర్ సైంటిస్ట్ అయిన సత్య నాదెళ్ల మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ కాదు…సత్య కంటే ముందు ఆ సంస్థకు సీఈవో గా చేసిన పేరున్న సేల్స్ లీడర్ స్టీవ్ బాల్మర్ కాదని…2014 లో ఆయన్ను సీఈవో గా ప్రకటించడమే ఓ ఆశ్యర్యకరమైన ఎంపిక అని ఫార్చ్యూన్ బిజినెస్ పేర్కొంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే 1992 లో మైక్రోసాప్ట్ సంస్థలో చేరిన సత్య నాదెళ్ల తన ప్రతిభా పాటవాలతో సీఈవో స్థాయికి చేరుకున్నారు. మంచి టీమ్ ఉంటే సీఈవో ఏదనుకుంటే అది చేయగలడని…నాకు అలాంటి టీమ్ ఉందని సత్య నాదెళ్ల తరచుగా అంటుంటారు.
మాస్టర్ కార్డు సీఈవో అజయ్ బంగా ఎనిమిదో స్థానాన్ని, జయశ్రీ ఉల్లాల్ జాబితాలో 18వ స్థానాన్ని పొందారు. 10 ఆర్ధిక కారకాల ఆధారంగా జాబితాను సిద్ధం చేస్తామని ఫార్ఛూన్స్ బిజినెస్ సంస్థ తెలిపింది.