ఢిల్లీ ప్రభుత్వం లోని ఇద్దరు మంత్రులు.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ రాజీనామాల కారణంగా ఖాళీ అయిన శాఖల భర్తీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ చర్యలు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషి పేర్లను ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనాకు పంపారు. వీరిద్దరినీ మంత్రివర్గం లోకి తీసుకునేందుకు సంబంధించిన ముసాయిదాను బుధవారం సక్సేనాకు పంపినట్టు అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో సిసోడియా, జైన్ రాజీనామాలను సక్సేనా.. రాష్ట్రపతి ముర్ము ఆమోదం కోసం ఆమెకు పంపినట్టు వారు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి, రాజీనామా చేసిన సిసోడియా.. ఇటీవలివరకు 18 శాఖలను నిర్వహించారు.
విద్యా శాఖ, ఫైనాన్స్, ప్రజా పనులు వంటి వివిధ పోర్టుఫోలియోలను ఆయన నిర్వహించినప్పటికీ.. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసు ఆయన ప్రతిష్టను మసక బారేలా చేసింది.
ఇక మనీ లాండరింగ్ కేసులో నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ జైలు పాలయి.. జైల్లో సిబ్బంది చేత సేవలు చేయించుకుంటూ వీడియోలకు చిక్కారు. నిన్న వీరి రాజీనామాల అనంతరం.. కేజ్రీవాల్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ కి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ కి అదనపు శాఖల బాధ్యతను అప్పగించింది. సౌరభ్ భరద్వాజ్, అతిషి మంత్రులుగా బాధ్యతలు చేబట్టేంతవరకు వీరు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.