కేరళలో సాగుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఎలా జరిగిందో గానీ పొరబాటు జరిగిపోయింది. కోచ్చి లోని ఓ వీధిలో గోడమీద వెలసిన బ్యానర్ లోని ఫోటోలు, చిత్రాలను చూసినవారు ఆశ్చర్యపోయారు. వాటిలో హిందూ మహాసభ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ చిత్రం కూడా ఉంది.
ఈ పొరబాటుకు కాంగ్రెస్ ఇరకాటంలో పడగా.. బీజేపీ, సీపీఎం ఇదే అదనని కాంగ్రెస్ ని విమర్శల వెల్లువలో ముంచెత్తాయి. రాహుల్ యాత్ర ప్రజల్లో వర్కౌట్ కాకపోవడంతో, వారినుంచి స్పందన లేకపోవడంతో ఇలాంటి గిమ్మిక్కులకు దిగుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా ట్వీట్ చేశారు. చరిత్రను రాహుల్ వక్రీకరించజూస్తున్నారని ఆయన ఆరోపించారు.
స్వాతంత్య్ర సమరయోధులపై రాహుల్ విరజిమ్ముతున్న విషం అందరికీ తెలిసిందేనన్నారు. సావర్కర్ ని కాంగ్రెస్ పార్టీ ఏనాడూ గౌరవించలేదన్నారు. ఇదే పార్టీ నేత అమిత్ మాలవీయ.. ఇన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీకి సావర్కర్ ని గౌరవించే ‘ఉద్దేశం’ వచ్చిందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ వైనం రచ్చ అయింది. నెటిజన్లు పార్టీని ఓ’ ఆట ‘ఆడుకున్నారు. తమ మిస్టేక్ ని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ నేతలు వెంటనే ఆ బ్యానర్ పైని సావర్కర్ చిత్రం స్థానే మహాత్మా గాంధీ చిత్రాన్ని అతికించారు.
అయితే స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాల్లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్త ఎవరో బహుశా గూగుల్ నుంచి ఈ చిత్రాన్ని సెలెక్ట్ చేసి ఉంటారని, దీంతో తమకు సంబంధం లేదని పార్టీ సీనియర్ నేత జైరాంరమేష్ పేర్కొన్నారు. ఆ కార్యకర్తను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. భారత్ జోడో యాత్రలో ఇలాంటి పొరబాట్లు జరుగుతుంటాయని, వాటిని పట్టించుకోవలసిన పని లేదని అన్నారు.