సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా డబ్బు కాజేస్తున్నాడు కేటుగాళ్లు. ఏకంగా ప్రభుత్వ పథకాలు పేరు చెప్పి పంగనామాలు పెట్టేస్తున్నారు. వారి మాయమాటలు నమ్మి చాలా మంది అమాయకులు బలైపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇదే తరహాలో మోసం చేసి డబ్బు కొట్టేశారు కొంతమంది కేటుగాళ్లు.
బ్యాంకు అధికారులమని అకౌంట్‌లో సొమ్ము కాజేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయగా విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలోని చల్లావారిపల్లె గ్రామానికి చెందిన మంజులకు రాయలపేట ఇండియన్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంది.
కాగా అకౌంట్ లింకప్ ఉన్న ఫోన్ నెంబర్ కు ఓ వ్యక్తి ఫోన్ చేశారు. బ్యాంకు నుంచి మేనేజరును మాట్లాడుతున్నానని ఏటీఎం కార్డు గడువు ముగిసిందని చెప్పాడు. వెంటనే అప్డేట్ చేయాలని ఆధార్ నంబరు, అకౌంట్ నంబరు అడిగాడు. ఆ తర్వాత మొబైల్‌కి వచ్చిన ఓటీపీ చెప్పమని అడిగాడు.
ఆమె కూడా చెప్పటంతో అకౌంట్ లో ఉన్న రూ. 74,571 కొట్టేశాడు. కొంతసేపటికి బాధితుడి మొబైల్‌కి మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి బ్యాంకుకు వెళ్లి అడగగా అసలు విషయం బయటకు వచ్చింది.