స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మరో కొత్త సదుపాయాన్ని తాజాగా అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల ఎస్‌బీఐ కస్టమర్లు ఏటీఎం కార్డు మోసాలు జరగకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. ఇకపై కస్టమర్ బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్లి మినీ స్టేట్ మెంట్ లేదా బ్యాలెన్స్ ఎంక్వయిరీ చేస్తే కస్టమర్ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దీంతో కస్టమర్ తాను ఏటీఎంలో ఆ ఎంక్వయిరీ చేయకపోతే వెంటనే కార్డును బ్లాక్ చేయవచ్చు. దీంతో ఏటీఎం కార్డు మోసాలు జరగకుండా ఉంటాయి.
కాగా ఎస్‌బీఐ ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. కస్టమర్‌కు చెందిన బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్‌మెంట్ ఎంక్వయిరీ ఏటీఎం ద్వారా జరిగినప్పుడల్లా కస్టమర్ ఫోన్‌కు మెసేజ్ వెళ్తుందని, కస్టమర్ గనక ఆ ఎంక్వయిరీ చేయకపోతే వెంటనే కార్డును బ్లాక్ చేసి జరగబోయే మోసాన్ని ముందుగానే అరికట్టవచ్చని తెలిపింది. చాలా వరకు దుండగులు ముందుగా కస్టమర్ బ్యాంక్ లో ఎంత మొత్తం ఉందో తెలుసుకునేందుకు బ్యాలెన్స్ ఎంక్వయిరీ లేదా మినీ స్టేట్‌మెంట్ ఎంక్వయిరీ చేస్తారని, దీంతో అకౌంట్‌లో ఉన్న మొత్తంను బట్టి వారు నగదును విత్‌డ్రా చేస్తారని ఎస్‌బీఐ తెలిపింది.
అయితే బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్‌మెంట్ ఎంక్వయిరీ ఏది వచ్చినా అప్పటికప్పుడు దాని గురించి తెలుసుకుంటే వెంటనే వినియోగదారుడు జాగ్రత్తపడి తన అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకుంటాడని ఎస్‌బీఐ పేర్కొంది. అందుకనే ఇలా ఆయా ఎంక్వయిరీలకు మెసేజ్‌లను పంపాలని నిర్ణయించుకున్నామని తెలిపింది.
కాగా ఎస్‌బీఐలో ఇప్పటికే కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు గాను కస్టమర్లు ఎస్‌బీఊ ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసేందుకు ముందుగా ఎస్‌బీఐ యాప్‌లో ఓటీపీని రిక్వెస్ట్ చేయాలి. తరువాత దాన్ని ఏటీఎంలో ఎంటర్ చేస్తే చాలు.. కార్డు పెట్టాల్సిన పనిలేకుండానే నగదు తీసుకోవచ్చు. అయితే రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల మధ్య రూ.10వేల కన్నా మించి డబ్బు విత్‌డ్రా చేస్తే ఆ ఓటీపీతోపాటు డెబిట్ కార్డు పిన్‌ను కూడా కస్టమర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.