చనిపోయిన వ్యక్తికి లోన్ మంజూరు చేశారు బ్యాంక్ అధికారులు. లోన్ నగదు అందించడకుండానే.. తిరిగి చెల్లించాలంటూ అతని కుటుంబ సభ్యులకు నోటీసులు పంపారు. ఇది చూసిన ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. అసలు మాకు లోన్ డబ్బులు ఇవ్వనే లేదని వాపోతున్నారు. ఈ వింత ఘటన మధ్య ప్రదేశ్ ఛింద్ వాఢలో జరిగింది.
డీటైల్స్ లోకి వెళ్తే.. చౌరాయ్ తాలుకాలోని తూన్ వాఢ గ్రామానికి చెందిన అజబ్ సింగ్ వర్మ అనే రైతు 2006లో లోన్ కోసం ఛింద్ వాఢ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్లై చేసున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే అజబ్ సింగ్ మరణించాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు లోన్ గురించి మరచిపోయారు. అయితే మూడేళ్ల తర్వాత అతడి పేరుపై రుణాన్ని మంజూరు చేసింది ఎస్బీఐ బ్యాంక్.
2018లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక.. రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. దీంతో బ్యాంక్ అధికారులు అజబ్ కుటుంబ సభ్యులకు లేఖ రాశారు.
ఈ నోటీసు అందుకున్న కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. అప్పటివరకూ అజబ్ ఫ్యామిలీ సభ్యులకు లోన్ వచ్చిన విషయమే తెలీదు. తమకు ఎలాంటి రుణాన్ని చెల్లించకుండానే.. రుణమాఫీ చేసినట్లు నోటీసులు ఎలా ఇచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరోవైపు రుణమాఫీ చేస్తున్నట్లు నోటీసులు పంపిన బ్యాంక్ అధికారులు ప్లేట్ మార్చారు. రూ2,75,000 చెల్లించాల్సిందేనంటూ మరోసారి అజబ్ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. లోన్ కట్టాలంటూ తమను వేధిస్తున్నారని మృతుడి కుమారులు వాపోతున్నారు. అనంతరం వారు కలెక్టర్ ను ఆశ్రయించి, బ్యాంక్ అధికారులపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.