బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 27వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితులపై కీలక ఆరోపణలు ఉన్నాయని అయినా సిట్ దర్యాప్తుని పక్కన పెట్టారని ధర్మాసనానికి విన్నవించారు.
ఈ కేసులో ఉన్న ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా, అలాంటప్పుడు సీబీఐకి విచారణను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. గురువారం రాత్రి 9 గంటలకు కేసు లిస్ట్ అయినందున వాదనలకు మరింత సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు కేసులో కీలక ఆధారాలు లీక్ చేశారన్న విషయాన్ని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆధారాలను మీడియాకే కాదు, జడ్జీలకు పంపారని అన్నారు. ఇరు పక్షాల వాదనల అనంతరం కేసు విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేశారు. అయితే సుప్రీం ఇవ్వబోయే తీర్పు ఈ కేసును ఎలా మలుపు తిప్పబోతుందనేది ఆసక్తిగా మారింది.