ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్. రామ్, ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తదితరులతో బాటు ఆరుగురు దీనిపై పిల్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపేందుకు కోర్టు అంగీకరించింది.
ఈ బ్యాన్ నిరంకుశమైనది, రాజ్యాంగ విరుద్ధమైనదని పిటిషనర్లలో ఒకరైన అడ్వొకేట్ ఎం.ఎల్. శర్మ ఆరోపించారు. తమ పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాలని వీరు కోరగా.. ఫిబ్రవరి 6 న ఈ కేసును లిస్ట్ లో ఉంచాలని సీజేఐ డీవై. చంద్రచూడ్ ఆదేశించారు. వివాదాస్పదమైన ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించరాదని కేంద్రం ఇటీవల ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలను ఆదేశించింది.
2002 లో మోడీ గుజరాత్ సీఎంగా ఉండగా జరిగిన అల్లర్లను ఈ డాక్యుమెంటరీ హైలైట్ చేసింది. అయితే దీనిపై నిషేధం.. అధికరణం 19 (1) (ఏ) కింద భావప్రకటనా స్వేచ్చను అతిక్రమించేదిగా ఉందని ..పిటిషనర్లు పేర్కొన్నారు. అసలు గుజరాత్ అల్లర్లకు ఎవరు కారకులనేదానిపైనా దర్యాప్తునకు ఆదేశించాలని కూడా వీరు కోరారు.
ఇటీవల ఢిల్లీ సహా దేశంలోని కొన్ని యూనివర్సిటీల విద్యార్థులు.. కేంద్ర నిషేధాన్ని ఉల్లంఘించి దీన్ని ప్రదర్శించేందుకు యత్నించారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించడానికి కూడా వారు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.