శివసేన పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది. ఈ కేసుపై అత్యవసర విచారణను చేపట్టాలన్న ఉద్దవ్ ఠాక్రే అభ్యర్థనను సీజేఐ డీవై చంద్రచూడ్ అంగీకరించారు.
శాసన సభలో బలం ఆధారంగా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం తీర్పునిచ్చిందని ఉద్దవ్ ఠాక్రే తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ అన్నారు. ఇది ప్రధానమైన వివాదాల్లో ఒకటని ఆయన అన్నారు. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఎదుట ప్రత్యేక వాదనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికే సీఎం షిండే వర్గం శివసేన కార్యాలయాన్ని లాగేసుకున్నారని అన్నారు. ఇప్పుడు బ్యాంకు అకౌంట్లను స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో అనర్హత వేటు కూడా వేస్తారని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలపై స్టే విధించక పోతే వారు ఠాక్రే నుంచి మొత్తం లాగేసుకుంటారని వాదనలు వినిపించారు.
ఈ క్రమంలో పిటిషన్ పై వాదనలను ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపట్టేందుకు అంగీకారం తెలిపారు. ఎన్నికల సంఘం తీర్పును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సుప్రీం కోర్టును సోమవారం ఆశ్రయించారు. తటస్థ మధ్యవర్తిగా తవి విధులు నిర్వర్తించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆయన పిటిషన్ లో వెల్లడించారు.