మూడు నెలల్లోగా ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమాచార హక్కు చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం కూడా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15 న ఆదేశించినా ఇప్పటి వరకు నియమించలేదంటూ లాయర్లు ప్రశాంత్ భూషన్ కోర్టు దృష్టికి తీసుకురావడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస ఎస్.ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకం కోసం వేసే సెర్చ్ కమిటీ సభ్యుల పేర్లను కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ కమిషన్ వెబ్ సైట్లలో రెండు వారాల్లో ఉంచాలని కోర్టు సూచించింది. తమకు అవసరం లేని విషయాల్లో కూడా సమాచారం కోరుతూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీన్ని నియంత్రించకపోతే ప్రభుత్వోద్యోగులు స్వేచ్ఛగా పని చేసుకోలేరంది. సమస్యకు సంబంధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తాము సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకం కాదని..అయితే కొన్ని మార్గదర్శకాలు అవసరమని ధర్మాసనం పేర్కొంది.