ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సౌరభ్ కిర్పాల్ అనే ‘గే'(స్వలింగ సంపర్కుడి) ని నియమించాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు మళ్ళీ సమర్థించింది. ఆయన నియామకానికి సంబంధించిన తన సిఫారసును సుప్రీంకోర్టు కొలీజియం మళ్ళీ గుర్తు చేసింది. ఈ నియామక వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రాసెస్ చేయవలసిన అవసరం ఉందని, ఈ పదవికి ఆయన తగిన అభ్యర్థి అని పేర్కొంది.
కిర్పాల్ ను ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమించాలని 2021 నవంబరు 11 న చేసిన సిఫారసును కొలీజియం ప్రస్తావిస్తూ.. ఆయన అభ్యర్థిత్వానికి సానుకూల అంశాలే ఉన్నాయని, కేంద్రం ఈ ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. సీజేఐ డీవై. చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కె.ఎం. జోసెఫ్ మధ్య జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సౌరభ్ కిర్పాల్ నియామకం ఢిల్లీ హైకోర్టు బెంచ్ కి విలువ తెస్తుందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. . కిర్పాల్ ప్రవర్తన హుందాగా ఉంటుందని, పేర్కొంటూ.. అయిదేళ్లుగా ఆయన పేరు ఈ పదవికి సంబంధించి పెండింగులో ఉందని, దీన్ని తులనాత్మకంగా చూడాలని వారన్నారు. ఇలా మూడో సారి ఆయన పేరును కొలీజియం సిఫారసు చేయడం విశేషం. కేంద్రం చెబుతున్న అభ్యంతరాలను, అందుకు కొలీజియం వివరణలను కోర్టు మొదటిసారి బహిర్గతం చేసింది.
ఈయన గే అని,ఈయన పార్ట్ నర్ ఓ స్విస్ పౌరుడని కేంద్రం ఇదివరకే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కిర్పాల్ భాగస్వామితో దేశానికి ముప్పు ఉందని భావించలేమని, పైగా స్విట్జర్లాండ్ కూడా మనకు మిత్ర దేశమేనని న్యాయమూర్తులు సంతకం పెట్టిన లేఖ వివరించింది.